Chandrababu: ఎన్నికల సంఘం దారుణంగా తయారైంది: చంద్రబాబు
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం
- ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
- ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగితే ఏమైనా మార్చేస్తున్నారని ఆరోపణ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం దారుణంగా తయారైందని ఆరోపించారు. ఉదయం రిజర్వేషన్లు ప్రకటించి, సాయంత్రానికి దానిపై నోటిఫికేషన్ ఇస్తారని, ఆపై డీలిమిటేషన్ చేసి మళ్లీ మార్పులు, చేర్పులు చేస్తున్నారని విమర్శించారు. సరిహద్దులు మార్చేయడం, క్యాస్ట్ లు మార్చేయడం, రిజర్వేషన్లు మార్చడం, ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ను మళ్లీ మార్చేయడం... ఇలాంటివి ఒకట్రెండు కాదు కోకొల్లలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
"పీలేరులో 19 ఎంపీటీసీ రిజర్వేషన్లు మార్చేశారు. వాల్మీకిపురంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 10 నిలిపివేశారు. ఏం చేయాలి వీళ్లను. ఎమ్మెల్యే అడిగితే రిజర్వేషన్లు మార్చేయడం, డీలిమిటేషన్ వంటివి చేసేస్తారు. మంత్రి అడిగితే ఏమైనా మార్చేస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చాక హోర్డింగ్ లు తొలగించడమే కాదు విగ్రహాలకు కూడా గుడ్డలు కట్టేస్తారు. కానీ పథకాల హోర్డింగ్ లు అలాగే ఉన్నాయి. మరోవైపు ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. దాంతో అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీ సేవ కేంద్రాల ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. ఫాస్ట్ ట్రాక్ కాస్తా నో ట్రాక్ గా తయారవుతోంది. సంబంధిత అధికారులను సెలవు పెట్టి వెళ్లిపొమ్మంటున్నారు. తద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్లు లేకుండా చేసి నామినేషన్లు వేయనివ్వకుండా చేయాలన్నది వాళ్ల పన్నాగం.
ఇంకోవైపు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోటీ చేస్తే పర్యవసానాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. డబ్బులు, మద్యం ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి... ప్రజల మనిషి కాదు. అయోధ్య రామిరెడ్డి... ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేదు. వైవీ సుబ్బారెడ్డి.... ఓసారి ఎంపీగా గెలిచారు.
మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, వేమా ప్రభాకర్ రెడ్డి.. వీళ్లందరూ డబ్బుల సంచులు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. డబ్బులు ఖర్చుపెట్టకపోతే వీళ్లందరూ అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఏం చేస్తారు వాళ్లు, వాళ్లేమన్నా పెద్ద నాయకులా? వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా? వీళ్లవల్ల ఏమవుతుంది? మంత్రుల్ని కాదని ఈ ఐదుగుర్ని ఇన్ చార్జిలుగా నియమించడం ఎందుకు?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.