Nirbhaya: లాయర్లు తనను మోసం చేశారంటూ నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్!
- 20వ తేదీన ఉరి తీయాలని డెత్ వారెంట్
- వయసును, సామాజిక పరిస్థితిని చూడాలన్న వినయ్ శర్మ
- తనకు అన్యాయం జరిగిందన్న ముఖేశ్ సింగ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకూ తాజా డెత్ వారెంట్ మార్చి 20 కాగా, ఆ రోజున కూడా ఉరితీత అమలు వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన వయసును, ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మరణదండన శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు వినయ్ శర్మ పిటిషన్ పెట్టుకున్నాడు. తన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా అతను పిటిషన్ ను పంపించాడు.
ఇదే సమయంలో మరో ఆసక్తికర పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరో దోషి ముఖేశ్ సింగ్, తన న్యాయవాది తనను మోసం చేశాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, లాయర్ బృంద గ్రోవర్ తదితరులు తనపట్ల నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, దీనిపై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలంటూ, తన కొత్త లాయర్ ఎంఎల్ శర్మర్ తో పిటిషన్ వేయించాడు. తనతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ తనకు అన్యాయం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.
వాస్తవానికి ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేశ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు 20న ఉరి అమలు కావాల్సి వుంది. కాగా, ముఖేశ్ సింగ్ వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించినా, విచారణకు ఆదేశించినా, దోషులకు ఉరి వాయిదా పడే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ పిటిషన్ ను నేడో, రేపో సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశాలు అధికమని న్యాయ నిపుణులు అంటున్నారు.