Andhra Pradesh: గుంటూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు.. హోం మంత్రి ఎదుటే బాహాబాహీ
- ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వాగ్వివాదం
- ఒకరినొకరు నెట్టుకున్న నేతలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
గుంటూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు బయటపడింది. సాక్షాత్తూ హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో మండిపడిన మంత్రి వారికి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులో జరిగిందీ ఘటన. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యలో నిన్న స్థానిక విష్ణు ఆలయంలోని కల్యాణ మండపంలో మంత్రి ఆశావహులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులను మంత్రి వేదికపైకి పిలిచి మాట్లాడారు. అలాగే, రేటూరు గ్రామ ఆలయ ట్రస్టు సభ్యుల ప్రతిపాదనలపైనా చర్చ జరిగింది. అయితే, రెండు వర్గాల నుంచి వేర్వేరుగా సభ్యులను ప్రతిపాదించడం ఘర్షణకు కారణమైంది. ఇరు వర్గాలు వాదనలకు దిగి ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగ్రహించిన మంత్రి సుచరిత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
అలాగే, పెదనందిపాడులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతుండగా కొన్ని గ్రామాలకు చెందిన నాయకులు మంత్రి ఎదురుగానే బాహాబాహీకి దిగారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు మంత్రి కష్టపడాల్సి వచ్చింది.