Hyderabad: మానసిక ఒత్తిడి భరించలేక.. ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్ ఆత్మహత్య
- హైదరాబాద్ శివారు మీర్‌పేటలో ఘటన
- ఆత్మహత్యకు ఉన్నతాధికారులే కారణమన్న తండ్రి
- పని ఎక్కువ చెప్పి ఒత్తిడికి గురిచేశారని ఫిర్యాదు
మానసిక ఒత్తిడి భరించలేని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన కె.ప్రవీణ్ కుమార్ (42) రాజేంద్రనగర్ ట్రాన్స్‌కోలో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా ఇటీవల మానసికంగా కుంగిపోయాడు. దీంతో గత నెల రోజులుగా సిక్ లీవ్ తీసుకుని ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి బయటకు వెళ్తున్నట్టు భార్యకు చెప్పి పై అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పని ఒత్తిడి వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు పని ఎక్కువ చెప్పి తనను వేధిస్తున్నారని పలుమార్లు తనతో చెప్పి వాపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.