Corona Virus: నెల్లూరులో కరోనా లక్షణాల బాధితుడు... ఏపీలో హై అలర్ట్!
- ఇటలీ నుంచి వచ్చిన బాధితుడు
- థర్మల్ స్క్రీనింగ్ లో చిక్కని జ్వర లక్షణాలు
- నెల్లూరుకు వచ్చిన తరువాత కరోనా లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు వ్యాపించింది. ఇక్కడి చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు అతనిలో ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. అతని కుటుంబీకులను కూడా అదే వార్డులోని ప్రత్యేక గదిలో ఉంచి, పరిశీలిస్తున్నారు.
కాగా, ఇతను మూడు రోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చాడు. ఎయిర్ పోర్టులో దిగిన సమయంలో థర్మల్ స్క్రీనింగ్ లో ఎటువంటి జ్వర లక్షణాలూ లేకపోవడంతో బయటకు పంపినట్టు తెలుస్తోంది. ఇంటికి రాగానే కరోనా లక్షణాలు ఇతనిలో బయట పడ్డాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఏపీ సర్కారు, నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. గత రెండు మూడు రోజులుగా, బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతను కలిసిన వ్యక్తులను సంప్రదిస్తూ, వారిని జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం జలుబు, జ్వరం లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. బాధితుడిని కలిసిన వారు ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు.