Maruti Rao: ఆస్తిలో సగం తమ్ముడికి, సగం భార్యకు... అమృత పేరిట ఒక్క పైసా కూడా రాయని మారుతీరావు!

No Will in the Favour of Amrutha from Maruti Rao

  • గతంలో రాసిన వీలునామాను మార్చిన మారుతీరావు
  • పోలీసుల చేతిలో మారుతీరావు వీలునామా
  • నిందితుడిగా ఆయన పేరును తొలగించండి
  • నేడు కోర్టులో పోలీసుల పిటిషన్

మిర్యాలగూడలో పరువు హత్యకు పాల్పడి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి, ఆపై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేడు కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణ జరుగనుండగా, చార్జ్ షీట్ కు అదనంగా ఈ వీలునామా పత్రాల కాపీలను పోలీసులు జత చేయనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మరణించడంతో, అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.

కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా ఆస్తి కూడా రాయలేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తరువాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీరావు తన కుమార్తె పేరిటే రాసినట్టుగా ప్రచారం జరిగింది. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఈ కేసులో మొత్తం 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1,200 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఏ1గా మారుతీరావు ఉండగా, ఏ6గా ఆయన తమ్ముడు శ్రవణ్ ఉన్నారు.

  • Loading...

More Telugu News