Kadiri Babu Rao: వైసీపీలో చేరిన బాలకృష్ణ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు
- జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కదిరి బాబూరావు
- గత ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఓటమి
- ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉన్న వైనం
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీకి షాక్ ఇచ్చారు. కాసేపటి క్రితం ఆయన వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావును జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా బాబూరావుకు పేరుంది. అయినప్పటికీ ఆయన టీడీపీని వీడటం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈయన పార్టీని వీడనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి.
2014 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బాబూరావు గెలుపొందారు. 2009లో సైతం ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ... సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత సమయం మించిపోవడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.
2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బాబూరావు కోరినప్పటికీ... ఆ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి చంద్రబాబు కేటాయించారు. బాబూరావును దర్శి నుంచి బరిలోకి దింపారు. బాలయ్య మాటను కాదనలేక దర్శి నుంచే ఎన్నికల బరిలో బాబూరావు నిలిచారు. ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత... పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.