Chandrababu: చంద్రబాబు రాకతో గేట్లు మూసేసిన పోలీసులు... అక్కడే బైఠాయించిన టీడీపీ అధినేత
- మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై దాడి
- డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన చంద్రబాబు
- డీజీపీ లేకపోవడంతో అడిషనల్ డీజీకి విజ్ఞాపన పత్రం
టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమపై గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... దాడిలో గాయాలపాలైన నేతలు, దెబ్బతిన్న వాహనాలసహా పాదయాత్రగా బయల్దేరారు. అయితే, డీజీపీ కార్యాలయం వద్దకు చంద్రబాబు చేరుకోగానే పోలీసులు గేట్లు మూసేశారు. చంద్రబాబు, ఇతర నేతలను లోనికి రానివ్వకుండా నిలువరించారు. దాంతో చంద్రబాబు డీజీపీ ఆఫీసు ఎదుటే రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ నేతలపై దాడులు జరుగుతుంటే కొన్నిచోట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ డీజీపీ ఆఫీసులో లేరని, అడిషనల్ డీజీ వస్తే ఆయనకు విజ్ఞాపన పత్రం సమర్పించామని చెప్పారు. ఈ సందర్భంగా 'సీపీఐ' రామకృష్ణ టీడీపీ నేతలకు సంఘీభావం ప్రకటించారు.