Mekathoti Sucharitha: దాడి ఘటనపై తన, మన అనే భేదం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: హోంమంత్రి సుచరిత ప్రకటన
- మాచర్ల దాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన హోంమంత్రి
- టీడీపీ నేతల వాహనం వేగంగా వెళుతుండడంతో వాగ్వాదం జరిగిందని వెల్లడి
- వారిని డీఎస్పీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు
పల్నాడు మార్కు రాజకీయాలు మరోసారి ఆవిష్కృతమైన నేపథ్యంలో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమపై మాచర్లలో జరిగిన దాడిపై వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు వాహనంలో వేగంగా వెళుతుండడంతో, అక్కడి ప్రజలతో వాగ్వివాదం, ఆపై ఘర్షణ ఏర్పడ్డాయని తెలిపారు.
రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని నిరోధిస్తుంటే, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇవాళ మాచర్లలో దాడికి పాల్పడిన తురకా కిశోర్, గోపి, నాగరాజు అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని సుచరిత వెల్లడించారు. ఎక్కడా తన, మన అనే భేదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాడి జరిగిన సమయంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలను డీఎస్పీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించారని తెలిపారు.