Chalasani Srinivas: ఏపీ ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాటం తప్పదు: చలసాని
- డెల్టాలో గ్యాస్, పెట్రోలు నిక్షేపాల కోసం తవ్వకాలను నిషేధించాలి
- తమిళనాడు ప్రభుత్వం అలానే చేసింది
- ఇతర రాష్ట్రాల వారిని పెద్దల సభకు పంపడం వల్ల ఉపయోగం లేదు
గతంలో ఇతర రాష్ట్రాల నేతలను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు గుజరాత్‌కు చెందిన వ్యాపారిని పెద్దల సభకు పంపిస్తున్నారని, అయితే ఏపీ ప్రజల సొమ్ముతో పదవి, జీతభత్యాలు పొందుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తే సహించబోమన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు 5.30 కోట్ల మంది ఉన్నారని, వారంతా స్వతంత్రంగా ఆలోచిస్తారని అన్నారు. వారి హక్కులు, ఆత్మగౌరవానికి భంగం కలిగితే పోరాడతామని హెచ్చరించారు. డెల్టా ప్రాంతంలో గ్యాస్, పెట్రోలు నిక్షేపాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేసిన చలసాని.. ఏపీలోనూ నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రాకు కేంద్రం ఇచ్చిందని చలసాని అన్నారు.