Corona Virus: యూరప్ నుంచి వచ్చే వారిని నిషేధించిన అమెరికా... విదేశీ టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన ఇండియా!
- కఠిన నిర్ణయమే అయినా తప్పనిసరి
- 30 రోజులు యూరప్ వాసులను రానివ్వబోము
- స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్
- ఏప్రిల్ 19 వరకూ విదేశీ టూరిస్టుల రాకపై భారత్ నిషేధం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలుగా అమెరికా, ఇండియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యూరప్ లోని అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. నేటి నుంచి 30 రోజుల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. "ఇది కాస్తంత కఠినమైన నిర్ణయమే అయినా, తప్పనిసరి" అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యూకే వ్యాప్తంగా 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇటలీలో వైరస్ విజృంభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక ఇదే సమయంలో కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్న ఇండియా, గతంలో జారీ చేసిన అన్ని టూరిస్ట్ వీసాలనూ రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన వెలువరించింది. ఏప్రిల్ 19 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని నరేంద్ర మోదీ సర్కారు ప్రకటించింది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పేర్కొంది.