new airport: వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదన రాలేదు: కేంద్ర మంత్రి

No proposal on new airports from Telangana Hardeep Puri

  • లోక్‌సభలో కోమటిరెడ్డి ప్రశ్నకు సమాధానం 
  • ఆరు చోట్ల ఎయిర్‌‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన
  • స్థలాలపై అధ్యయనం చేసిన విమానాశ్రయాల ప్రాధికార సంస్థ 

వరంగల్‌లో నూతన విమానాశ్రయ ఏర్పాటు కోసం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర  పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌‌లో వీటిని నిర్మించాలని  భావిస్తోంది. సర్కారు చొరవతో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఇప్పటికే ఈ ప్రాంతాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది.

వరంగల్‌లో ఎయిర్‌‌పోర్టు కోసం మన్మూర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని గుర్తించింది. అయితే, శంషాబాద్ విమానాశ్రయానికి, మన్మూర్‌కు మధ్య 145 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం రెండు ఎయిర్‌‌పోర్టుల మధ్య కనీసం 150 కి.మీ దూరం అయినా ఉండాలి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఎయిర్‌‌ పోర్ట్ ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించగా తమ వద్దకు ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి హర్దీప్ పురి స్పష్టం చేశారు.

‘దేశవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌‌పోర్టులు అభివృద్ధి చేయాలని మంత్రిత్వ శాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్ పాలసీ అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం లేదా ఎయిర్‌‌పోర్టు కంపెనీ.. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ముందుగా స్థల అనుమతి పత్రం తీసుకోవాలి. అయితే, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్‌ పాలసీ ప్రకారం వరంగల్, మన్మూర్‌‌లో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇతరుల నుంచి గానీ ఎలాంటి ప్రతిపాదన మాకు అందలేదు’ అని హర్దీప్ తెలిపారు.

  • Loading...

More Telugu News