- మహిళల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం
- ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లకు పర్మిట్ల నుంచి మినహాయింపు
- కొత్త బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరాలు తప్పనిసరి
దేశంలో కోటికిపైగా జనాభా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రతకు సంబంధించి లోక్ సభలో కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతా మహిళా సిబ్బందే..
పింక్ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ సహా అంతా మహిళా సిబ్బందే ఉంటారని, వాటిలో మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా అలాంటి బస్సులను ప్రారంభించారని.. అవి విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో పెద్ద నగరాల్లో పింక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు.
కొత్త బస్సుల్లో ప్యానిక్ బటన్లు తప్పనిసరి
కొత్తగా తయారు చేస్తున్న అన్ని బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరాలు తప్పనిసరి అని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు బస్సుల తయారీ సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇక కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ తెలిపారు. విద్యుత్ తో నడిచే (ఎలక్ట్రిక్) టూవీలర్లు, త్రీవీలర్లకు పర్మిట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్టు చెప్పారు.