Chandrababu: మాచర్లకు ఎవరూ వెళ్లకూడదా? అదేమన్నా పాకిస్థానా?: చంద్రబాబునాయుడు
- మాచర్లకు పోకూడదా? వీసా కావాలా?
- ఇది మీ తాత జాగీరా?
- రాబోయే రోజుల్లో ఏ ఊరికి ఎవరూ పోకూడదా?
మాచర్లలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాచర్లకు బోండా ఉమ, బుద్ధా వెంకన్న రావాల్సిన అవసరం ఏంటి? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారన్న ప్రశ్నపై బాబు స్పందిస్తూ, ‘మాచర్లకు ఎవరూ పోకూడదా? ఇది (మాచర్ల) పాకిస్థానా? వీసా కావాలా? మీ తాత జాగీరా? ’ అంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో ఏ ఊరికి ఎవరూ పోకూడదా? తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తామని, ‘మీ గుండెల్లో నిద్రపోతాం. రౌడీయిజం చేస్తే అదే మీకు చివరి రోజు. ఇలాంటి రౌడీలను చాలామందిని చూశాం. నలభై ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా.. మళ్లీ ఫైట్ చేస్తా. రాజశేఖర్ రెడ్డిని చూశా.. ఇంకా చాలా మంది రౌడీలను చూశాను’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నాయకులు మాచర్ల పోవాలంటే ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా? పిచ్చి పట్టిందా? కొవ్వు పట్టిందా?‘ అంటూ ధ్వజమెత్తారు. ఏయే స్థానాల్లో అయితే ఏకగ్రీవం చేసుకున్నారో, అవన్నీ రీ– షెడ్యూల్ చేయాలని, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకూ వదలిపెట్టమని, అవసరమైతే, చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని, రాజకీయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.