Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వద్దన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే... పరిశీలిస్తామన్న హోమ్ మంత్రి!

Stop Drunken Drive Tests demand from TRS MLA
  • అసెంబ్లీలో విజ్ఞప్తి చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురికి పరీక్షలు చేస్తున్నారని ఆరోపణ
  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న మహమూద్ అలీ
ఇదే జరిగితే మందుబాబులకు శుభవార్తే. కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న వేళ, వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను కొంతకాలం నిలిపివేయాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. స్వయంగా టీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రతిపాదనను తీసుకుని వచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ, మాట్లాడిన ఆయన, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో కరోనా ఫీవర్ నడుస్తోందని గుర్తు చేసిన ఆయన, ఆందోళన తగ్గేంతవరకూ టెస్టులు నిలిపివేయాలని కోరారు. బ్రీథింగ్ టెస్టుల్లో ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురికి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఈ పరీక్షలు నిలిపివేయాలని సూచించారు. దీనిపై స్పందించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తామని, అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వారాంతాల్లో రాత్రిపూట డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. బ్రీతింగ్ స్ట్రా పెట్టి ఊదిస్తున్నా, ముందు ఊదిన వ్యక్తిలో కరోనా వైరస్ ఉంటే, అది ఆ తరువాత ఊదే వ్యక్తికి సోకే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రీత్ అనలైజర్లలోకి గాలిని ఊదేందుకు పలువురు వాహనదారులు నిరాకరిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగుతున్న పరిస్థితి నెలకొంది.
Drunk Driving
Hyderabad
Md Mahamood Ali
Manchireddy Kishan Reddy

More Telugu News