Jyotiraditya Scindia: బీజేపీలో చేరిన సింధియాకు షాక్.. ఫోర్జరీ కేసును మళ్లీ ఓపెన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం!

Forgery Case Against Jyotiraditya Scindia Reopened Day After He Joins BJP

  • 2014లో సింధియా కుటుంబంపై నమోదైన కేసు
  • విచారణ జరిపి 2018లో కేసును మూసేసిన వైనం
  • బాధితుడి ఫిర్యాదుతోనే మళ్లీ కేసును ఓపెన్ చేశామన్న అధికారి

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాకిస్తూ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సింధియాపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోజు వ్యవధిలోనే చర్యలకు దిగింది. గతంలో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఉన్న ఫోర్జరీ కేసును మళ్లీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మిన సందర్భంగా వారు తప్పుడు పత్రాలను సృష్టించారనే కేసు వారిపై 2014లో నమోదైంది.

ఈ సందర్భంగా ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ కేసును రీ ఓపెన్ చేసిన విషయం నిజమేనని చెప్పారు. సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... అప్పటి లావాదేవీలో చోటుచేసుకున్న వాస్తవాలను వెలికితీయాలంటూ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు.

2009లో సింధియాల నుంచి తాను మహల్గావ్ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశానని తన తాజా ఫిర్యాదులో శ్రీవాస్తవ తెలిపారు. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్నదానికంటే 6 వేల చదరపు అడుగుల స్థలం తక్కువగా ఉందని ఆయన చెప్పారు. తప్పుడు పత్రాలతో తనకు భూమిని అమ్మారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి 2014 మార్చి 26న సింధియాలపై ఆయన తొలిసారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు 2018లో కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన ఫిర్యాదు చేయడంతో... కేసును మళ్లీ ఓపెన్ చేసినట్టు సదరు అధికారి వెల్లడించారు.

ఈ అంశంపై సింధియాకు అత్యంత సన్నిహితుడైన పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ, రాజకీయ కక్షలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని మండిపడ్డారు. సింధియా తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో... గతంలో ఈ కేసును మూసేశారని చెప్పారు. కేవలం ప్రతీకారం కోసమే కేసును మళ్లీ తెరిచారని అన్నారు. న్యాయం తమవైపే ఉందని... కమల్ నాథ్ ప్రభుత్వానికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News