Cristiano Ronaldo: నిర్బంధంలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. కరోనా లేదని ప్రకటన!
- జువెంటస్‌కు చెందిన అతని సహచరుడికి కరోనా పాజిటివ్
- రొనాల్డోలో వైరస్ లక్షణాలు లేవని చెప్పిన పోర్చుగల్ ప్రభుత్వం
- ముందు జాగ్రత్తగా క్వారెంటైన్లో ఉన్న సాకర్ లెజెండ్
తన జట్టుకు చెందిన ఓ ఆటగాడికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం స్వీయ నిర్బంధం (క్వారెంటైన్)లో ఉన్నాడు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులను కలవరపరిచింది. అయితే, రొనాల్డోలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని పోర్చుగల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఇటలీలో జరిగిన ‘సిరీస్ ఏ ఫుట్‌బాల్’ టోర్నీలో రొనాల్డో జువెంటస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే టీమ్‌కు చెందిన డానియెల్ గురాని (ఇటలీ)కి కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్ లక్షణాలు బయటికి కనిపించకపోయినప్పటికీ అతనికి కరోనా సోకిందని జువెంటస్ క్లబ్ తెలిపింది. దాంతో, గురానిని తాకిన ఆటగాళ్లు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పింది.
రొనాల్డో వారం రోజుల కిందటే తన స్వస్థలం అయిన మదీరా (పోర్చుగల్)కు వెళ్లిపోయాడని తెలిపింది. కాగా, ఇటలీ నుంచి వచ్చిన రొనాల్డో, అతని కుటుంబ సభ్యుల్లో కరోనా లక్షణాలు కనిపించడం లేదని మదీరా స్థానిక ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా అతను క్వారెంటైన్లో ఉన్నాడని, ఐసోలేషన్ మాత్రం ప్రారంభించలేదని చెప్పింది.