- కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
- ఈ నెల 21న పరిస్థితిపై సమీక్షిస్తాం
- ముందు జాగ్రత్త అని పేర్కొన్న యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ లో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థ లన్నింటినీ మరికొంత కాలం మూసే ఉంచుతామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ నెల 22వ తేదీ వరకు మూసి ఉంచాలని నిర్ణయించామని, 22వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు.
వైరస్ ఎఫెక్ట్ పై సమావేశం
యూపీలో కరోనా వైరస్ పరిస్థితిపై శుక్రవారం లక్నోలో ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత యోగి మీడియాతో మాట్లాడారు. అవసరమైతే విద్యా సంస్థల మూసివేతను మరికొంత కాలం పొడిగిస్తామని చెప్పారు. ఇప్పటికే మొదలైన పరీక్షలను కొనసాగిస్తామని, ఇంకా మొదలుకాని పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నామని తెలిపారు.
జనం గుమిగూడే కార్యక్రమాలు వద్దు
రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ఎక్కువమంది గుమిగూడే కార్యక్రమాలు చేపట్టవద్దని యోగి సూచించారు ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితి ఏమీ లేదని, అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పారు. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.