Nadendla Manohar: అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: నాదెండ్ల మనోహర్
- రాజమండ్రిలో నాదెండ్ల మీడియా సమావేశం
- పోలీసులే నామినేషన్ పత్రాలు చించేస్తున్నారని వెల్లడి
- అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆరోపణ
- రేపు రాజమండ్రిలో 'మన నుడి, మన నది' కార్యక్రమానికి శ్రీకారం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామిక రీతిలో, దౌర్జన్యపూరిత ధోరణిలో సాగుతున్నాయని జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అయినప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో ఓ జనసేన అభ్యర్థికి చెందిన నామినేషన్ పత్రాలను పోలీసులే చించివేయడం దారుణమని పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను బైండోవర్ కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
టీడీపీ గతంలో చేసిన తప్పులనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు. అప్పుడు జన్మభూమి కమిటీలతో చేశారని, ఇప్పుడు వలంటీర్ల పేరుతో చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో నాదెండ్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి గోదావరి తీరంలో 'మన నుడి, మన నది' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పార్టీ వర్గాలు సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారని తెలుస్తోంది.