Kesineni Nani: జగన్ గారూ.. మీ అరాచకాలను ఇక్కడ సాగనివ్వరు: కేశినేని నాని
- విజయవాడను రాయలసీమ, పల్నాడు మాదిరి చేద్దామనుకుంటున్నారా?
- మీ అరాచకాలను విజయవాడ ప్రజలు సాగనివ్వరు
- నామినేషన్ల సందర్భంగా హింసపై కేశినేని నాని విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
విజయవాడను కూడా రాయలసీమ, పల్నాడు మాదిరి చేద్దామనుకుంటున్నారా జగన్ గారూ? అని ప్రశ్నించారు. విజయవాడ ప్రజలు మీ ఆటలను సాగనివ్వరని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన 'బరితెగింపు.. గెలుపే లక్ష్యంగా వైసీపీ అరాచకాలు' అనే కథనం స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.