Corona Virus: ‘కరోనా’ సోకిందని అసత్యాలు చెప్పి.. ఆఫీసులో సెలవులు తీసుకున్న ఉద్యోగి
- చైనాలో ఘటన
- అతడిని ఆసుపత్రిలో చేర్పించడానికి వెళ్లిన పోలీసులు
- కరోనా సోకలేదని నిర్ధారణ
- మూడు నెలల జైలు శిక్ష
తనకు కరోనా వైరస్ సోకిందని అబద్ధాలు చెప్పి ఆఫీసుకు సెలవులు పెట్టాడు ఓ ఉద్యోగి. చివరకు దొరికిపోయి శిక్ష అనుభవిస్తున్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ ఉద్యోగి తన ఆఫీసుకు ఫోన్ చేసి, తనకు కరోనా వైరస్ వచ్చిందని అసత్యం చెప్పాడు.
దీంతో భయపడిపోయిన ఆ కార్యాలయ అధికారులు అతడిని ఆఫీసుకు రావద్దని, పూర్తిగా సెలవులు తీసుకోవాలని చెప్పారు. ఆ కార్యాలయంలో ఇతర ఉద్యోగులకు కూడా వైరస్ సోకిందా? అనే భయం నెలకొనడంతో మూడు రోజులపాటు సిబ్బందికి సెలవులిచ్చారు. ఆ కార్యాలయాన్ని మొత్తాన్ని శుభ్రం చేయించారు.
అనంతరం తన సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని వారు పోలీసులకు సమాచారం తెలిపారు. అతడికి వ్యాధి ఎలా సోకిందనే విషయంతో పాటు ఏయే ప్రాంతాల్లో తిరిగాడో తెలుసుకోవాలని పోలీసులు భావించారు. అలాగే, అతడిని వెంటనే చికిత్సకు తరలించాలనుకున్నారు.
తాను ఓ షాపింగ్ మాల్లో కొంతమందిని కలిశానని పోలీసులకు ఆ ఉద్యోగి తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు అంటూ పలు పత్రాలు చూపించాడు. అయితే, అవన్నీ ఫోర్జరీ చేసినవి పోలీసులు తేల్చారు. వైద్య పరీక్షలు కూడా చేయించి, అతడికి కరోనా లేదని నిర్ధారణ చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నందుకు అతడికి మూడు నెలల జైలు శిక్ష పడింది.