Kanna Lakshminarayana: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదు: కన్నా
- హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ కు కన్నా లేఖ
- తమ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్నారని ఫిర్యాదు
- పోలీసుల అండతో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని ఆరోపణ
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లకు లేఖ రాశారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. పలు చోట్ల దాడులతో భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అని అభివర్ణించారు.
పోలీసుల అండతోనే వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని కన్నా ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించిందని, విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుందని వెల్లడించారు. అవసరమైన చోట కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ తెలిపిందని వివరించారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని, 6 వారాల తర్వాత ఎన్నికలను పారదర్శకంగా జరపాలని కోరారు.