Jagan: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం: సీఎం జగన్
- రమేశ్ కుమార్ తో మాట్లాడమని గవర్నర్ ని కోరాం
- ‘కరోనా’ సాకుతో ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా వేస్తారా?
- చంద్రబాబు హయాంలో నియమించబడ్డ వ్యక్తి రమేశ్ కుమార్
కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం సబబు కాదని, నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తో మాట్లాడమని కోరామని చెప్పారు. రమేశ్ కుమార్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ ఆయనలో మార్పు రాకపోతే కనుక ఇంకా పైస్థాయిల్లో ఉన్న వ్యక్తుల దృష్టికి తీసుకెళతామని, రమేశ్ కుమార్ తీరును ఎండగట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డ వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అని, బాబు సామాజిక వర్గానికే చెందిన వారని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించని రమేశ్ కుమార్ విచక్షణనూ కోల్పోయారని ధ్వజమెత్తారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏ అధికారి అయినా పని చేయాలని, అప్పుడే గౌరవం అని అన్నారు.
‘కరోనా’ వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నానని ప్రకటించిన రమేశ్ కుమార్, మాచర్ల సీఐ సహా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను తప్పిస్తున్నట్టు ప్రకటించారని, వారిని తప్పించే అధికారం ఆయనకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, తాను ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఈ అధికారం జగన్మోహన్ రెడ్డిదా? రమేశ్ కుమార్ దా? అని ప్రశ్నించారు.