Jagan: ఎవడో ఆర్డరిస్తున్నాడు..ఈయన చదువుతున్నాడంటూ రమేశ్ కుమార్ పై జగన్ ఆగ్రహం
- ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా వేస్తూ నాలుగు పేజీల ఆర్డర్ ఇచ్చారు
- ఆ ఆర్డర్ సంగతి ఎన్నికల సంఘంలోని సెక్రటరీకే తెలియదు
- సీఎస్, హెల్త్ సెక్రటరీలను సంప్రదించకుండానే ఆర్డరిచ్చారు!
ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు నాలుగు పేజీల ఆర్డర్ ఈరోజు ఉదయం వచ్చిందని, ఈ ఆర్డర్ వస్తున్న విషయం ఎన్నికల సంఘంలోని సెక్రటరీకి కూడా తెలియదని విమర్శించారు. ‘ఎవడో ఆర్డరిస్తున్నాడు.. ఈయన చదువుతున్నాడు‘ అంటూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఉద్ధేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవైపు ఏమో ఎన్నికలు రద్దు ప్రకటన చేశారు, మరోవైపున ఎస్పీలను, అధికారులను రమేశ్ కుమార్ తన ఇష్టానుసారం బదిలీలు చేశారని, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేయాలని ఆదేశించారని మండిపడ్డారు.
‘కరోనా’ వైరస్ పేరిట ఎన్నికలు వాయిదా ఆర్డరు ఇచ్చేముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెల్త్ సెక్రటరీలను సంప్రదించలేదని, వారి సలహాలు, సూచనలు తీసుకోలేదని రమేశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. కానీ, ఆర్డర్ కాపీలో మాత్రం వారి సలహాలు తీసుకుంటున్నట్టు రాశారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడే ఆయనకు ఈ పదవి ఇచ్చి ఉండొచ్చు, వాళ్లిద్దరి సామాజికవర్గం ఒకటే కావొచ్చు కానీ ఇంత వివక్షచూపడం ధర్మేమనా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? అన్ని ప్రశ్నించారు.