Pawan Kalyan: ’స్థానిక‘ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మరోమారు జరగాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు
- పోలీస్ వ్యవస్థ నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం బాధాకరం
- కేంద్ర మంత్రి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాస్తా
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మరోమారు జరగాలని జనసేన పార్టీ అధినేత పవన్ డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక, దౌర్జన్యపూరిత ఘటనలు జరిగాయని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధివిధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ‘జనసేన’ లీగల్ విభాగాన్ని ఆదేశించనున్నట్టు చెప్పారు.
కరోనా వైరస్ నిరోధానికి చేపట్టిన చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డప్పటికీ, నామినేషన్ల ప్రక్రియ మరోమారు జరగాలని డిమాండ్ చేశారు. ఏఏ స్థాయిలో అధికారులకు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాశారో ఆ వివరాలన్నీ తయారు చేయాలని తమ నేతలకు చెప్పామని, ఈ నివేదికను ప్రజల ముందు పెడతామని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రికి, ఎన్నికల సంఘానికి తానే స్వయంగా లేఖలు రాస్తానని చెప్పారు. వైసీపీ పాలన వస్తే ‘హింస’ ఎక్కువైపోతుందని గతంలోనే చెప్పానని, చెప్పినట్టే జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోమని రోడ్లపైకి వచ్చి ఎదురు తిరుగుతామని హెచ్చరించారు.