IYR Krishna Rao: సీఎం అధికారాలకు కూడా పరిమితులు ఉంటాయని ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది: ఐవైఆర్ కృష్ణారావు
- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
- ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
- ట్విట్టర్ ద్వారా హితవు పలికిన ఐవైఆర్
కరోనా భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సీఎం జగన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అధికారాలకు కూడా పరిమితులు ఉంటాయని సీఎం గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ యంత్రాంగంలో సీఎంకు కొత్తగా ఒనగూరే అధికారాలేవీ ఉండవని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేసేముందు కొంత ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.
సహేతుకమైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ఐవైఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ఒక్క విషయం మినహాయిస్తే.... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఆ ప్రక్రియ ముగిసేవరకు మిగతా అన్ని అంశాల్లో అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని వ్యాఖ్యానించారు.