Italy: ఇటలీలో కరోనా కల్లోలానికి ఒక చిన్న పొరపాటే కారణమట!
- జనవరిలో రెండు కేసులు నమోదు
- ఫిబ్రవరిలో మూడో వ్యక్తికి చికిత్స
- సాధారణ ఫ్లూగానే భావించిన వైద్యులు
- ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తుల మరణం
- ఈ లోపలే చేజారిన పరిస్థితి
కరోనా వైరస్ ప్రభావం ఇటలీలో తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఆ దేశంలో 1300 మందికి పైగా మరణించారు. వాస్తవానికి జనవరిలోనే కరోనా వైరస్ ను అక్కడ గుర్తించారు. వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలను కూడా చేపట్టింది. అయితే ఒక చిన్న పొరపాటు కారణంగా అది అక్కడ వేగంగా విస్తరించింది.
జనవరిలో రెండు కరోనా కేసులు నమోదైన వెంటనే... అక్కడి ప్రభుత్వం ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చైనా నుంచి వచ్చే విమానాలను నిషేధించింది. ఫిబ్రవరి 18న కోడోగ్నో పట్టణంలో మూడో కేసు నమోదైంది. దీంతో, దీన్ని సాధారణ ఫ్లూగానే అక్కడి డాక్టర్లు భావించారు. మూడో వ్యక్తికి కూడా చికిత్స చేసి, ఇంటికి పంపించేశారు.
ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునేలోపలే అంతా చేజారి పోయింది. ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో, అక్కడి ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయింది. పట్టణాలను దిగ్బంధించింది. ఆ తర్వాత దేశం మొత్తాన్ని దిగ్బంధించింది. కోడోగ్నోలో కరోనా లక్షణాలతో వచ్చిన వ్యక్తిని అప్పుడే క్వారంటైన్ చేసి, సరైన వైద్య చికిత్స అందించి ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలోని పరిస్థితులు ఉండేవి కావని విశ్లేషకులు చెబుతున్నారు.