Madhya Pradesh: ఎంపీలో బల పరీక్ష కోసం సుప్రీంకోర్టుకు బీజేపీ
- విశ్వాస పరీక్షకు ఆదేశాలివ్వాలని పిటిషన్
- రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం
- ఈ నెల 26 వరకు వాయిదా పడ్డ అసెంబ్లీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఎంపీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాన్ని కమల్ నాథ్ సారథ్యంలోని సర్కారు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే హక్కు కాంగ్రెస్ లేదని విమర్శించింది.
సోమవారం ప్రారంభమైన ఎంపీ అసెంబ్లీ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల్లో కమల్ క్యాబినెట్ ఆమోదించిన తన ప్రసంగాన్ని గవర్నర్ లాల్జీ టాండన్ పూర్తిగా చదవడానికి నిరాకరించారు. రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యేలకు సూచిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
బడ్జెట్ సమావేశాల ఎజెండాలో ‘విశ్వాస పరీక్ష’ను చేర్చకపోవడంపై ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక, అసెంబ్లీ ముగిసిన వెంటనే ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ తమకు మద్దతుగా ఉన్న 106 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అఫిడవిట్‌ను గవర్నర్‌కు సమర్పించారు. వీలైనంత త్వరగా బల పరీక్షను నిర్వహించాలని కోరారు.