Vijay Sai Reddy: ఇలా ద్రోహులను చొప్పించడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా?: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు స్లీపర్ సెల్స్ ను చొప్పించారంటూ విమర్శలు
- ప్రజలు ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టంలేదని వ్యాఖ్యలు
- నిధులు రాకపోతే ఏంటని ఈ నిద్రాణశక్తులు అంటున్నాయని ట్వీట్
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద సంస్థలు వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు కోవర్టులు, స్లీపర్ సెల్స్ ను సమాజంలో ప్రవేశపెడతాయని, ప్రజా సంక్షేమం కోసం ఐకమత్యంగా పనిచేయాల్సిన చోట ఈ విధంగా ద్రోహులను చొప్పించడం, సమయం చూసి వారు విధ్వంసానికి దిగడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా అదేనని, చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని, వ్యవస్థలోకి ఆయన చొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండీగా చెబుతున్నాయని విమర్శించారు. దేశం కంటే కులమే గొప్పదని, తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడని, ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అని ఈ నిద్రాణ శక్తులు అంటున్నాయని మండిపడ్డారు.