Rahul Gandhi: టాప్– 50 డిఫాల్టర్ల పేర్లు వెల్లడించండి: రాహుల్ గాంధీ డిమాండ్
- లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
- ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానంపై అసంతృప్తి
- సభ నుంచి వాకౌట్ చేసిన రాహుల్
యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగవేసిన టాప్–50 మంది డిఫాల్టర్ల పేర్లు చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు లోక్‌సభ సమావేశాల్లో ఆయన కేంద్రాన్ని కోరారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని బడా బాబుల వివరాలు బహిర్గతం చేయాలన్నారు.
దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.. యస్ బ్యాంకులో ప్రతి ఒక్క డిపాజిటర్ సురక్షితంగా ఉంటారని హామీ ఇచ్చారు. యస్ బ్యాంకును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే, ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే, మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని రాహుల్ సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. డిఫాల్టర్ల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలను వార్తా పత్రికల్లో ప్రచురించాలని అన్ని బ్యాంకులను కోరింది. ఈ మేరకు తమ బోర్డుల నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని బ్యాంకులకు లేఖ రాసింది.