Nara Lokesh: అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తాం: నారా లోకేశ్
- ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం
- పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారని విమర్శలు
- సిగ్గుగా లేదా జగన్ గారూ అంటూ ట్వీట్
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో మండిపడ్డారు. తుగ్లక్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రి పూట అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నందుకు సిగ్గుగా లేదా జగన్ గారూ అంటూ నిలదీశారు. పోలీసు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కోర్టు ముందు నిలబెడుతున్నారని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించి మరీ అక్రమంగా అరెస్టులు చేస్తున్న అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తామని లోకేశ్ హెచ్చరించారు.
"టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారు, టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకర పోస్టులు చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు ఉండవు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసూల్ అనే కార్యకర్త అరెస్ట్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లోకేశ్ అక్కడి పోలీసులను ప్రశ్నించారు. రసూల్ కు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.