South African: పాపం దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. కరోనా భయంతో ఇంకా భారత్‌లోనే
- కరోనా నేపథ్యంలో ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులకు వచ్చేందుకు భయం
- లక్నోలో హోటల్ గదులకే పరిమితమైన ఆటగాళ్లు
- రేపు కోల్‌కతా నుంచి దుబాయ్ మీదుగా స్వదేశానికి పయనం
భారత్‌తో మూడు వన్డేల సిరీస్ అర్థాంతరంగా రద్దయినా కరోనా భయంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఇంకా మన దేశంలోనే ఉన్నారు. సిరీస్‌లో మిగతా రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారమే ప్రకటించింది. అప్పటికే ధర్మశాల నుంచి లక్నో చేరుకున్న సఫారీల ప్లేయర్లు.. వెంటనే స్వదేశానికి తిరుగు పయనం అవ్వాలని అనుకున్నారు. కానీ, కరోనా భయం వారిని హోటల్ గదులకు పరిమితం చేసింది.
వాస్తవానికి శనివారంలోపే వాళ్లు ఢిల్లీ చేరుకొని అందుబాటులో ఉన్న విమానం ఎక్కాల్సింది. కానీ, ఢిల్లీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆ నగరానికి వెళ్లేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు ససేమిరా అన్నారు. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ముంబై ఎయిర్‌పోర్టుకు కూడా రామని చెప్పారు. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని సురక్షిత నగరానికి తీసుకెళ్లి అక్కడి నుంచి తమను స్వదేశానికి పంపించాలని బీసీసీఐని సఫారీ టీమ్ కోరింది. అప్పటిదాకా క్రికెటర్లంతా లక్నోలో తమ హోటల్ గదులకే పరిమితం అయ్యారు.
సఫారీల విజ్ఞప్తి మేరకు కరోనా కేసు నమోదవని కోల్‌కతాకు క్రికెటర్లను తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించింది. అక్కడ కూడా ఈడెన్ గార్డెన్‌కు దగ్గర్లోని రాజ్అర్హత్ హోటల్లో కాకుండా ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న హోటల్లో క్రికెటర్లకు బస ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతాకు వచ్చిన సఫారీ క్రికెటర్లు.. మంగళవారం ఉదయం అక్కడి నుంచి దుబాయ్ మీదుగా తమ స్వదేశానికి బయల్దేరనున్నారు.