Yanamala: ఎన్నికల కమిషనర్ కు రాసిన లేఖను సీఎస్ వెనక్కి తీసుకోవాలి: యనమల డిమాండ్
- ఎన్నికల వాయిదా నిర్ణయం వాపసు తీసుకోవాలని సీఎస్ లేఖ
- సీఎస్ లేఖ రాజ్యాంగ విరుద్ధమన్న యనమల
- ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణ అధికారాలను రాజ్యాంగమే కల్పించిందని వెల్లడి
కరోనాను కారణంగా చూపుతూ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ సీఎస్ నీలం సాహ్నీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ప్రభుత్వం జోక్యం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సీఎస్ లేఖ రాయడం రాజ్యంగ ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుందని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సీఎస్ నీలం సాహ్నీ రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
ఎన్నికలు వాయిదా వేయడానికి ఎస్ఈసీ ఎవరంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు స్వరం వినిపించడం దారుణమని అభివర్ణించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారాలను ఎస్ఈసీకి రాజ్యాంగం కల్పించిందని, కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఎలాంటి అధికారాలు ఉంటాయో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా అవే అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని యనమల గుర్తుచేశారు.