Chandrababu: ఇది మామూలు వైరస్ కాదు... లిఫ్టు బటన్ నొక్కినా అంటుకుంటుంది: చంద్రబాబు
- కరోనా దెబ్బతో ఇటలీ అతలాకుతలం అయిందన్న చంద్రబాబు
- ఫ్రాన్స్ లో వైరస్ ను నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని వెల్లడి
- వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శలు
కరోనా వైరస్ ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రశ్నించారు. ఇటలీ దేశం కేవలం నాలుగు వారాల్లో కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. ఫ్రాన్స్ లో ఎన్నికల్లో కరోనా కారణంగా 20 శాతం పోలింగ్ తగ్గిందని వివరించారు. ఓటింగ్ తగ్గడమే కాదు ఒకేరోజు 29 మంది చనిపోయారని, అక్కడ 24 గంటల వ్యవధిలో 900 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా 5400 కేసులు నమోదై ఓ విపత్తులా పరిణమించిందని, ఇంతటి ఆరోగ్య అత్యయిక స్థితి నడుమ ఎన్నికలు నిర్వహించడం ఏంటని ఫ్రాన్స్ లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని అన్నారు.
"ఓ మహమ్మారి ఉనికి చాటుకుంటున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అక్కడ ఒక్కసారిగా కేసులు పెరిగిపోయి వైరస్ ను నియంత్రించలేని పరిస్థితి వచ్చింది. ఇది మామూలు వైరస్ కాదు... ఓ లిఫ్టు బటన్ ను కరోనా ఉన్నవాళ్లు నొక్కి, ఆపై సాధారణ వ్యక్తులు ఆ బటన్ ను నొక్కితే వారికి సోకుతుంది. ఇంకా అనేక రూపాల్లో కరోనా సోకే ప్రమాదం ఉంది.
రాష్ట్రానికి వేల సంఖ్యలో విదేశాల నుంచి వస్తున్నారు. వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచాలని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. దీన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా తీసుకుంటోంది. ఐసోలేషన్ వార్డులు ఎక్కడున్నాయి? మీరు కేంద్రం మార్గదర్శకాలు అమలు చేసింది ఎక్కడ? కరోనా బాధితుల డిశ్చార్చి రూల్స్ ఏమైనా ఫాలో అయ్యారా? ఏంచేశారు మీరు? అన్ని ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు" అంటూ విమర్శించారు.