Chandrababu: వైసీపీ వాళ్లు చేసినవన్నీ చెబితే డీజీపీ సిగ్గుతో తలదించుకుంటాడు: చంద్రబాబు

Chandrababu fires on AP DGP over social media posts
  • సోషల్ మీడియాలో పోస్టులపై టీడీపీ కార్యకర్త అరెస్ట్
  • ఆ కార్యకర్త తప్పేంటని ప్రశ్నించిన చంద్రబాబు
  • వైసీపీ వాళ్లు ఇంతకంటే దారుణంగా రాస్తున్నారని ఆగ్రహం
  • తనపైనా అసభ్యంగా రాశారని ఆవేదన
సోషల్ మీడియాలో ఓ పోస్టు టీడీపీ కార్యకర్త అరెస్ట్ కు కారణమైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తున్నారు... వైసీపీ వాళ్లు ఇంతకంటే అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాలో ఇంతకంటే దారుణంగా రాస్తున్నారని, వాళ్లనెందుకు అరెస్ట్ చేయరని డీజీపీని ప్రశ్నించారు.

"ఏం తప్పుంది ఈ పోస్టులో? ఈ పోస్టు చేసిన మా టీడీపీ కుర్రాడ్ని అరెస్ట్ చేస్తారా? చూసుకుందాం! వదిలిపెడతానని అనుకోవద్దు. ఇందులో ఎవరైనా బట్టలిప్పి చూపించలేదే! ఏంటి మీకు అభ్యంతరం? ఇదే కాదు... నా గురించి, లోకేశ్ గురించి, అనురాధ గురించి అసభ్యంగా పోస్టులు చేస్తున్నారు. 'నారాసుర రక్తచరిత్ర' అంట! వివేకా హత్య జరిగిన తర్వాత నాపై ఈ పోస్టు పెట్టారు. ఇప్పటివరకు దానిపై చర్యలు తీసుకోలేకపోయారు. తానేదో దేశాన్ని ఉద్ధరించానని డీజీ చెబుతున్నాడు. దీనికేమంటారు?

ఏ తప్పు చేయని ప్రకాశం జిల్లా పామూరు కుర్రాడు రసూల్ ను అరెస్ట్ చేశారు. రసూల్ మా ఆఫీసులోనే సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తుంటాడు. ఇలాంటి పోస్టులే మాపై పెడితే మీ దగ్గరికి వస్తాను, ఎలా చర్యలు తీసుకోరో చూస్తాను! స్పందించని వాళ్లను ఏంచేయాలో మాకు బాగా తెలుసు. మేం రాసినవాటితో పోలిస్తే వాళ్లు రాస్తున్నవి ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాలంటే నాకే సిగ్గేస్తోంది. అమ్మాయిల గురించి అసభ్యంగా రాస్తున్నారు. అవన్నీ చెబితే డీజీపీ సిగ్గుతో తలదించుకోవాలి. మీ కూతుళ్లపైనో, మీ భార్యలపైనో ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా మీరు? పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం ఇకపై సాగనివ్వం. ఇప్పుడే డీజీపీకి లేఖ రాస్తున్నా, ఆయన సమాధానం ఇవ్వాల్సిందే" అంటూ మండిపడ్డారు.
Chandrababu
Social Media
Posts
Police
DGP
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News