Paritala Sriram: పరిటాల శ్రీరాంపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- గతంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌పై సునీత, రవీంద్ర పేర్లు
- తొలగించేందుకు ప్రయత్నించిన ఎంపీడీవీ
- ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ కేసు నమోదు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరాంపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామగిరిలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌పై చెక్కించిన పరిటాల సునీత, రవీంద్ర పేర్లను తొలగించేందుకు రామగిరి ఎంపీడీవో ప్రయత్నించారు. విషయం తెలిసిన శ్రీరాం అడ్డుకున్నారు.
ప్రభుత్వ జీవో ప్రకారమే ఆర్చ్‌కు నామకరణం చేశామని, ఇప్పుడు ఎలా తొలగిస్తారని వాగ్వివాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని కూడా ఎంపీడీవోకు అందించారు. దీంతో స్పందించిన ఎంపీడీవో ప్రస్తుతానికి ముసుగు వేసి ఆ తర్వాత తానే దగ్గరుండి పేర్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
అయితే, తాజాగా నిన్న రామగిరి పోలీస్ స్టేషన్‌లో శ్రీరాంపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 153 కింద శ్రీరాంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.