Maharashtra: నాగ్‌పూర్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 144 సెక్షన్ విధింపు
- మహారాష్ట్రలో 39 మంది కరోనా బాధితులు
- ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాకరణ
- ప్రజలు సహకరించాలన్న సీఎం ఉద్ధవ్ థాకరే
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగపూర్ మరో అడుగు ముందుకు వేసింది. 144 సెక్షన్ విధించింది. పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు.
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ఏ పట్టణాన్ని పూర్తిగా నిర్బంధించే ఉంచే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే, ప్రతి ఒక్కరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు గుంపుగా వెళ్లొద్దన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో వచ్చే 20 రోజులు ఎంతో కీలకమని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.