Cow Urine: ముంబయిలోని ఇస్కాన్ నిర్వాకం... టిఫిన్ చేసేందుకు వెళితే... గోమూత్రాన్ని చేతులపై చల్లిన వైనం!

Mumbai ISCON Temple Using Cow Urine to Sanitise Hands

  • జుహూ ప్రాంతంలో ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా రెస్టారెంట్
  • శానిటైజర్ అయిపోయిందన్న సాకుతో గోమూత్రం
  • దుర్వాసన రావడంతో ప్రశ్నించిన రాజూ నాయర్
  • కొందరు గోమూత్రాన్ని తాగుతారని పొగరుగా సమాధానం

ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరం సిబ్బంది చేసిన నిర్వాకం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. మందిరంలో శానిటైజర్ అయిపోయిందన్న కారణంతో, గోమూత్రంతో అక్కడికి వచ్చిన భక్తుల చేతులు శుభ్రం చేశారు. అదికూడా ఇస్కాన్ పరిధిలో ఉన్న గోవిందా రెస్టారెంట్ వద్ద. దీంతో పలువురు తీవ్ర విమర్శలు చేశారు.

రాజూ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తన స్నేహితునితో కలిసి ఇస్కాన్ టెంపుల్ లోపల ఉన్న గోవిందా రెస్టారెంట్ కు వెళ్లగా, తనిఖీల తరువాత చేతులు చూపాలని చెప్పిన సిబ్బంది, దానిపై ఏదో స్ప్రే చేశారు. అది చాలా దుర్వాసనగా ఉన్నట్టు అనిపించగా, రాజు, ఏమిటని అడిగారు. దీనికి వారిచ్చిన సమాధానం విని అవాక్కయ్యాడు.

చెప్పకుండా గోమూత్రాన్ని చేతులపై స్ప్రే చేయడం ఏంటని నిలదీయగా, కొందరు దీన్ని తాగుతుంటారు కూడా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చారు. తనకు గోమూత్రంతో చేతులు కడుక్కోవడం ఇష్టం లేదని, తన వద్ద శానిటైజర్ ఉంటుందని, తాను ఆలయానికి వెళ్లలేదని, కేవలం రెస్టారెంట్ కు తినేందుకే వెళ్లానని రాజూ నాయర్ చెప్పారు.

ఇక్కడి రెస్టారెంట్ లో తన మనోభావాలకు విరుద్ధంగా సిబ్బంది ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఈ విషయం వైరల్ కావడంతో ఆలయ అధికారి ఒకరు స్పందిస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయంలోని పలు చోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేశామని, గోవిందా రెస్టారెంట్ వద్ద ఉన్న శానిటైజర్ అయిపోవడంతో, గోమూత్రాన్ని వినియోగించామని అన్నారు. ఏదిఏమైనా భక్తులకు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ఇస్కాన్ అధికారుల తప్పేనని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News