Tirumala: గంటలోనే స్వామి దర్శనం... అయినా టీటీడీ ముందు కొత్త సమస్య!
- ఈ ఉదయం నుంచి నూతన విధానం
- నిర్దేశిత సమయం కన్నా ముందే వస్తున్న భక్తులు
- ఒకే ప్రాంతంలో వేచి చూస్తున్న సుమారు 20 వేల మంది
ఈ ఉదయం నుంచి తిరుమలలో వేచి చూసే విధానానికి స్వస్తి చెబుతూ, టైమ్ స్లాట్ టోకెన్ లో నిర్దేశించిన సమయానికి భక్తులు వస్తే, కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనాన్ని చేయిస్తున్న టీటీడీ ముందు ఇప్పుడు ఓ కొత్త సమస్య ఎదురైంది. నిన్న సాయంత్రం నుంచి టైమ్ స్లాట్ టోకెన్లను భక్తులకు జారీ చేస్తుండగా, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం తరువాత, 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సరిపడా భక్తులకు టోకెన్లు అందాయి.
ఇక మధ్యాహ్నం తరువాత టోకెన్లు పొందిన వారు కూడా, ఇప్పటికే క్యూలైన్లలోకి చేరేందుకు వచ్చి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారం ముందు వేచి చూడటం ప్రారంభించారు. కొన్ని వేల మంది తమకు ఇచ్చిన సమయం గురించి ఆలోచించకుండా ప్రధాన ద్వారం వద్దకు చేరి, రోడ్లపైనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. దీంతో శంఖుమిట్ట పార్కింగ్ ఏరియా నుంచి నారాయణగిరి ఉద్యానవనం వరకూ భక్తుల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం కిలోమీటర్ పరిధిలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు రోడ్లపై ఉన్నారు.
ఇక ఏ ఉద్దేశంతోనైతే తాము ఈ కొత్త విధానాన్ని ప్రారంభించామో, అది నెరవేరే క్రమంలో, తమకు కొత్త సమస్య ఎదురైందని టీటీడీ అధికారులు వాపోతున్నారు. భక్తులు తమకు కేటాయించిన సమయంలోనే క్యూలైన్ వద్దకు రావాలని పదేపదే పీఏ సిస్టమ్స్ ద్వారా చెబుతున్నప్పటికీ, ఎవరూ వినడం లేదని అంటున్నారు.