Pullela Gopichand: ఇంగ్లాండ్ నుంచి వచ్చి...స్వీయ నిర్బంధంలో వున్న పుల్లెల గోపీచంద్

badminton coach pullela gopichand in self quarantine

  • ఇంగ్లాండ్ నుంచి ఆదివారం నగరానికి వచ్చిన గోపీ
  • ప్రభుత్వ సూచనల మేరకు ఫామ్ హౌజ్‌లో స్వీయ నిర్బంధం
  • తన అకాడమీలు కూడా మూసి వేశామని తెలిపిన కోచ్
  • కరోనా కట్టడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు భేష్ అని కితాబు

భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్  కోసం ఇంగ్లండ్ వెళ్లి ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్న గోపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవ్వరినీ కలవకుండా ఒంటరిగా ఉంటున్నారు. తనకు కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా.. విదేశాల నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో ఇంటికి వెళ్లకుండా ఫామ్ హౌజ్‌లో లో స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఈ విషయాన్ని గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ కోసం తన శిష్యులు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తదితరులతో కలిసి గోపీ వారం రోజుల పాటు బర్మింగ్‌హామ్‌లో ఉన్నారు. అయితే, అన్ని దేశాలు కరోనాపై అప్రమత్తమైనా అక్కడి ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని గోపీ చెప్పారు. టోర్నీ జరిగిన స్టేడియంలో దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లు చూశారని, వారిలో ఎవరికైనా కరోనా ఉందో లేదో తెలియదన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన తాను ఇంటికి వెళ్లకుండా ఎయిర్‌‌పోర్టు నుంచి నేరుగా ఫామ్ హౌజ్‌కు వచ్చానని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించడం బాధ్యతాయుత పౌరుడిగా తన విధి అన్నారు. అందుకే వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటానని చెప్పారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భేష్ అని గోపీ కితాబిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.  

భారత క్రీడా ప్రాధికార సంస్థ, భారత బ్యాడ్మింటన్ సంఘం, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉన్న తన రెండు అకాడమీలను మూసివేశామని గోపీచంద్ తెలిపారు. ఈ నెల 31 వరకూ అకాడమీలు తెరుచుకోవన్నారు. ఈ ఖాళీ సమయాన్ని క్రీడాకారులంతా రికవర్ అయ్యేందుకు ఉపయోగించుకోవాలని ఈ దిగ్గజ కోచ్ సూచించారు.

  • Loading...

More Telugu News