Vijayabhasker Reddy: బోండా ఉమ విచారణకు హాజరు కాకపోగా ఇలా మాట్లాడటం కరెక్టు కాదు: సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి
- మాచర్ల ఘటన నేపథ్యంలో పోలీస్ విచారణకు హాజరుకాని బోండా
- తనను హతమార్చడానికే ఈ నోటీసులు ఇచ్చారని అంటారా?
- పైగా, గుంటూరు పోలీసులు నిద్రావస్థలో ఉన్నారంటారా?
- పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
మాచర్ల ఘటన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని టీడీపీ నేత బోండా ఉమకు గురజాల డీఎస్పీ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ విచారణకు హాజరు కాని ఉమ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు మండిపడుతున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసుల విచారణకు ఉమ హాజరుకాకపోగా, తనను హతమార్చడానికే ఈ నోటీసులు ఇచ్చారనడం, పైగా, గుంటూరు పోలీసులు నిద్రావస్థలో ఉన్నారనడం కరెక్టు కాదని అన్నారు. పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజలు భయపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. గురజాల పోలీస్ అధికారిపై నమ్మకం లేకపోతే ఆయన పై అధికారి వద్దకు ఉమా వెళ్లి తన వాంగ్మూలం ఇవ్వొచ్చుగా? అని ప్రశ్నించారు. ఇకపై ఎవరైనా పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.