Italy: 80 ఏళ్లుదాటిన వారికి కరోనా వస్తే మా వల్ల కాదు... తేల్చేసిన ఇటలీ!
- విలయతాండవం చేస్తున్న వైరస్
- గంటగంటకూ పెరుగుతున్న వ్యాధి బాధితులు
- వృద్ధులు ఇంట్లోనే చికిత్స పొందాలని వినతి
80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు కరోనా వ్యాధి సోకితే, వారికి చికిత్సను అందించలేమని ఇటలీ స్పష్టం చేసింది. దేశంలో వైరస్ విలయతాండవం చేస్తుండగా, ఇప్పటికే మృతుల సంఖ్య 2,200ను దాటేసింది. ఈ నేపథ్యంలో గంటగంటకూ కరోనా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ఇటలీ ఈ నిర్ణయం తీసుకుంది. వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని, వారిని ఐసోలేషన్, ఐసీయూల్లో ఉంచి చికిత్సను అందించలేమని పేర్కొంది.
ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన జారీ చేసింది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ఇప్పటికే దేశంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ బెడ్స్ అన్నీ నిండిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన మరో 10 వేల బెడ్స్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని, మరో రెండు రోజుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఇటలీలో కరోనా కారణంగా మరణించిన వారిలో 80 శాతం మందికి పైగా వయో వృద్ధులే ఉండటం గమనార్హం. వీరిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడమే మరణానికి కారణమని వైద్యులు తేల్చారు. ఇంతవరకూ 2,158 మంది వైరస్ కారణంగా చనిపోయినట్టు ఇటలీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 35 వేల మంది వరకూ చికిత్స పొందుతున్నారని పేర్కొంది.