Corona Virus: అమెరికాలో 22 లక్షల మంది... యూకేలో 5 లక్షల మంది చనిపోయే అవకాశం... సంచలనం రేపుతున్న బ్రిటన్ అధ్యయనం!
- మరింతగా విజృంభించనున్న వైరస్
- మరణాల సంఖ్య లక్షల్లోనే
- 1918లో వచ్చిన ఫ్లూ కన్నా చాలా ప్రమాదం
- యూకే ఇంపీరియల్ కాలేజ్ స్టడీ
ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా మహమ్మారి మరింతగా విజృంభించనుందని, దీని కారణంగా లక్షల్లో మరణాలు సంభవించే అవకాశం వుందని లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనం అంచనా వేసింది. ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికన్నా కొవిడ్-19 అత్యంత ప్రమాదకారని ఆ స్టడీ పేర్కొంది.
ఇంపీరియల్ కాలేజ్ మ్యాథ్స్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ నేతృత్వంలోని ఓ టీమ్, కరోనాపై నూతన సమాచారాన్ని, ఇటలీ నుంచి అందిన సమాచారాన్ని, ఇతర దేశాల్లో పరిస్థితులను, గణాంకాలను క్రోఢీకరించి సంచలన వివరాలు వెల్లడించింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ మహమ్మారితో పోలిస్తే, కరోనా చాలా భయంకరమైనదని అంచనా వేసింది. ఈ వైరస్ కారణంగా బ్రిటన్ లో 5 లక్షల మంది వరకూ మృత్యువాత పడచ్చని, అమెరికాలో 2.2 మిలియన్ ల మంది చనిపోవచ్చని పేర్కొంది.
ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలని వివిధ దేశాలు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవని అధ్యయనం పేర్కొంది. సమాజంలో ఐసోలేషన్ లేకుండా, కేవలం హోమ్ ఐసోలోషన్ వైరస్ వ్యాప్తిని అరికట్టజాలదని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా క్లబ్ లు, పబ్ లు, సినిమా హాల్స్ కు వెళ్లడాన్ని ప్రజలే విరమించుకోవాలని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు.
"కరోనా సమాజంపై అపరిమితమైన ఒత్తిడిని పెట్టనుంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది" అని ఇంపీరియల్ అధ్యయనంలో ఫెర్గ్యూసన్ తో కలిసి పని చేసిన ప్రొఫెసర్ ఆజ్రా ఘనీ వ్యాఖ్యానించారు. కఠిన కాలం ముందుందని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎమిడెమాలజీ నిపుణుడు టిమ్ కౌల్ బౌర్న్ హెచ్చరించారు. కరోనా కారణంగా వెల్లడయ్యే ఫలితాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయని ఆయన అంచనా వేశారు.