Chiranjeevi: 'కొండవీటి దొంగ' విషయంలో శ్రీదేవి ఆ షరతులు పెట్టారు: పరుచూరి గోపాలకృష్ణ
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'కొండవీటి దొంగ' సినిమాను గురించి ప్రస్తావించారు. 'కొండవీటిదొంగ' సినిమా విడుదలై 30 ఏళ్లు అయింది. మొన్న పేపర్లో చూసి తెలియని ఆనందానికీ, ఉద్వేగానికి లోనయ్యాను. నాయకా నాయికలుగా చిరంజీవిని .. శ్రీదేవిని దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాశాము. నిర్మాత త్రివిక్రమారావుగారు .. కథ అద్భుతంగా ఉందన్నారు.
చిరంజీవిగారికి కూడా కథ నచ్చేసింది .. హీరోయిన్ గా శ్రీదేవిని అనుకుంటున్నట్టుగా చెప్పి, ఆమెను కలిశాను. శ్రీదేవి ఇంటికి వెళ్లి నేనే కథ చెప్పాను. అంతా విన్న తరువాత ఈ సినిమా టైటిల్ ను 'కొండవీటి రాణి - కొండవీటి దొంగ' గా మార్చాలనే షరతు పెట్టారు. అలాగే లవ్ చేయమని హీరో వెంట హీరోయిన్ పడటాన్ని, హీరోనే హీరోయిన్ వెనక పడేలా మార్చమని అన్నారు. ఆ విషయం త్రివిక్రమరావుగారికి చెబితే, అలా కుదరదని చెప్పేశారు. ఆ తరువాత ఆ కథను ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా మార్చుకుని, రాధ - విజయశాంతిలతో చేశామని చెప్పుకొచ్చారు.