- ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందికర స్థితి
- స్కూళ్లు, కాలేజీల వంటివి మూసివేశాం
- నగరాల నిర్బంధాన్ని అమలు చేసే పరిస్థితి లేదని వెల్లడి
కరోనా వైరస్ కు ప్రస్తుతానికి ఎలాంటి మందులూ లేవు. అది వ్యాపించకుండా చూసుకోవడమే దాని నివారణకు మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) స్పష్టం చేసింది. ఇందుకోసం వీలైనంత వరకు నగరాలు, వివిధ ప్రాంతాలను మూసివేసి.. జనం ఇళ్లలోంచి బయటికి రాకుండా చూడాలని పేర్కొంది. కానీ తాము అలా చేయలేమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నిర్బంధాలను భరించే స్థితిలో తమ దేశం లేదని చెప్పారు. అలాగైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నారు.
ఆకలి చావులకు దారి తీస్తుంది
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు వివిధ దేశాలు అవలంబిస్తున్న తరహాలో నగరాల నిర్బంధాన్ని పాకిస్థాన్ అమలు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ ప్రతిపాదనలను తమ దేశ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే జనం ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధం విధిస్తే ప్రజలు ఆకలితో మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, క్రీడా ప్రాంగణాలు మూసివేశామని చెప్పారు.
200 మందికిపైగా కరోనా
కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు రెండు వందల మందికిపైగా వైరస్ సోకింది. సుమారు రెండు వేల మంది వరకు ఐసోలేషన్లలో ఉన్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న పాకిస్థాన్ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో లేదు. ఇప్పటికే అమెరికా, చైనా, ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో పరిస్థితిని వెళ్ళదీస్తోంది. ఇప్పుడు కరోనా దెబ్బ ఎలా ఉంటుందన్నది ఆందోళన కరంగా మారింది.