- కేటీఆర్ ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరా వినియోగించారంటూ కేసు
- గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్
- షరతులతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరా ఉపయోగించారన్న కేసులో రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బుధవారం హైకోర్టు ఆయనకు పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.
అక్రమంగా కట్టారంటూ రేవంత్ ఆందోళనతో..
హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి సమీపంలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌజ్ కట్టుకున్నారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట ఆరోపించారు. కొందరు మీడియా ప్రతినిధులను అక్కడికి తీసుకెళ్లి హడావుడి చేశారు. ఫామ్ హౌజ్ కు సంబంధించినవిగా చెబుతూ కొన్ని ఫొటోలను, పత్రాలను చూపించారు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ ప్రాపర్టీపై డ్రోన్ వాడారంటూ..
ప్రస్తుతం దేశంలో డ్రోన్ కెమెరాలు వాడాలంటే సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించారని, ప్రైవేటు ఆస్తులను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రేవంత్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.