Kajal Aggarwal: కాజల్‌ను కదిలించిన క్యాబ్ డ్రైవర్ కరోనా కష్టాలు!
- కరోనా దెబ్బకు కస్టమర్లు లేక ఖాళీగా క్యాబ్ డ్రైవర్
- రెండు రోజుల్లో తానే మొదటి కస్టమర్ అని చెప్పడంతో భావోద్వేగానికి గురైన కాజల్
- రూ. 500 అదనంగా ఇచ్చిన నటి
- అలాంటి వాళ్లకు ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కరోనా దెబ్బకు మన దేశంలోని చాలా నగరాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా పని దొరక్కపోవడంతో రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా భయంతో ప్రయాణికులులేక ఓ క్యాబ్ డ్రైవర్ పడుతున్న ఇబ్బందిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకుంది. గడచిన 48 గంటల్లో తానే అతని మొదటి కస్టమర్ అని చెప్పిన తీరు తనను కలచివేసిందని కాజల్ భావోగ్వేదానికి గురైంది. అలాంటి వారికి ఎంతో కొంత సాయం చేయాలని కోరింది.
‘ఈ రోజు నేను ఓ క్యాబ్ ఎక్కా. రెండు రోజుల నుంచి నేనే తన మొదటి కస్టమర్ అని ఆ డ్రైవర్ ఏడుస్తూ చెప్పాడు. కనీసం ఈ రోజైనా ఇంట్లోకి సరుకులు తెస్తానేమోనని తన భార్య ఎదురుచూస్తోందన్నాడు. కరోనా వైరస్ మనందరినీ ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కానీ, రోజువారీ ఆదాయంపైనే ఆధారపడే వాళ్ల జీవితాలను మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
తన చివరి కస్టమర్‌ను డ్రాప్ చేసిన తర్వాత 70 కిలోమీటర్లు ఖాళీగానే తిరుగుతున్నానని డ్రైవర్ నాకు చూపించాడు. దాంతో, అతనికి రూ. 500 అదనంగా ఇచ్చా. మనలాంటి వారికి అదేమంత పెద్ద మొత్తం కాదు. కాబట్టి మీ క్యాబ్ డ్రైవర్లు, వీధి వర్తకులకు ఎంతో కొంత సాయం చేయండి. ఎందుకంటే, ఆ రోజు వాళ్లకు మీరొక్కరే కస్టమర్ కావొచ్చు’ అని కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందేశాన్ని అందరితో పంచుకోవాలని కూడా కోరింది.