Corona Virus: వైరస్ నియంత్రణకు మరిన్ని చర్యలు ప్రకటించిన జగన్ సర్కారు!
- ఏపీ భవన్ లో స్పెషల్ కంట్రోల్ రూమ్
- సమన్వయకర్తగా ఐఏఎస్ అధికారి జేవీ మురళి
- హై లెవల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని చర్యలను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో స్పెషల్ కంట్రోల్ రూములను ప్రారంభించింది. సెక్రటేరియేట్ లోని ఎన్నార్టీ సెల్ లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమన్వయకర్తగా ఐఏఎస్ అధికారి జేవీ మురళిని నియమించింది. ఢిల్లీలో విదేశాంగ శాఖతో సమన్వయ బాధ్యతలను ఏపీ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించినట్టు ప్రకటించింది. పరిస్థితిని అనుక్షణం గమనించేందుకు హై లెవల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్ రెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారు మేడపాటి వెంకట్ సభ్యులుగా ఉంటారని పేర్కొంది.