- ఇదేంటని ఆపి ప్రశ్నించిన పోలీసులు
- స్పెయిన్ లోని ముసిరా పట్టణంలో ఘటన
- ఏకంగా 50 లక్షల వ్యూస్.. ట్విట్టర్ లో 62 వేల షేర్లు
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్పెయిన్ అతలాకుతలం అవుతోంది. వేల మందికి వైరస్ సోకింది. దాంతో ప్రభుత్వం ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని ఆర్డరేసింది. కానీ ఇలాంటి సమయంలో ఓ యువకుడు రోడ్డు మీదికి వచ్చాడు. రావడం మామూలుగా రాలేదు. డైనోసార్ లా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాడు. మెల్లగా గల్లీల్లో తిరగడం మొదలుపెట్టాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాసేపటికి పోలీసులు అటువైపుగా వచ్చారు. ఇదేంటని అడిగారు. ఇంట్లోంచి బయటికి రావొద్దని చెప్పాం కదా అని మెల్లగా హెచ్చరించారు. ఇక ఇంటికి పొమ్మని పంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెత్త పడేయడానికని వచ్చి..
కరోనా వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో స్పెయిన్ లోని చాలా ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేశారు. అలా నిషేధం ఉన్న ముసిరా పట్టణంలో ఈ వ్యక్తి నారింజ రంగులో ఉన్న ‘టైనోసరస్ రెక్స్’ తరహా డైనోసార్ కాస్ట్యూమ్స్ వేసుకుని రోడ్డు మీదికి వచ్చాడు. నిజానికి వచ్చింది చెత్తను డస్ట్ బిన్ లో పడేయడానికి.. కానీ పడేశాక వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. అది చూసిన పోలీసులు.. అలా తిరగొద్దని హెచ్చరించి పంపేశారు. ఇదంతా ఆ వీధుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.
డైనోసార్లు వచ్చినా అంతేనట..
అసలే ఆ నగరంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పోలీసులకు ఓ ఐడియా వచ్చింది. ఎవరూ బయటికి రావొద్దంటూ అవగాహన కల్పించేందుకు ఈ డైనోసార్ వ్యక్తి వీడియోలను తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టేశారు. సరదాగా కామెంట్ కూడా రాశారు. ‘‘అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఎవరూ బయటికి రావొద్దు. పెంపుడు జంతువులను తీసుకుని కాసేపు అలా ఇంటి ముందు తిరగొచ్చు. కానీ ఇలా డైనోసార్లతో తిరిగితే మాత్రం ఒప్పుకోబోము” అని ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఏకంగా 50 లక్షల మంది దానిని వీక్షించారు. లక్షల్లో లైకులు వచ్చాయి. 62 వేలకుపైగా షేరింగ్ చేశారు.
స్పెయిన్ లో దారుణంగా పరిస్థితులు
యూరోపియన్ దేశమైన స్పెయిన్ లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే వేల మందికి వైరస్ సోకగా.. మృతుల సంఖ్య కూడా వందల్లో ఉంది. ప్రపంచంలో చైనా, ఇటలీ, ఇరాన్ తర్వాత కరోనాతో అత్యంత ఎఫెక్ట్ పడిన దేశం స్పెయిన్. ఆ దేశంలోని నాలుగున్నర కోట్ల మందిని ఇళ్లలోంచి బయటికి రావొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.