Corona Virus: పంజాబ్ లో వృద్ధుడి మృతి... దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు
- అత్యధికంగా మహారాష్ట్రలో 42 కేసులు
- దేశం మొత్తమ్మీద 4 మరణాలు
- ఏపీలో ఒక్కటే పాజిటివ్ కేసు అంటూ నివేదికలో వెల్లడి
కొన్నివారాల కిందట దేశంలో ఉనికి చాటుకున్న కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. దేశమొత్తమ్మీద ఇప్పటివరకు 167 కరోనా కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో 25 మంది విదేశీయులు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున 4 మరణాలు సంభవించాయి.
తాజాగా పంజాబ్ లో 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు నిర్ధారించారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్టు తెలుసుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 42 మంది కరోనా బాధితులను గుర్తించారు. ఏపీలో పాజిటివ్ కేసు ఒక్కటేనని నివేదికలో పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కేరళలో 25 మందికి కరోనా సోకినట్టు తేలింది.